హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, పేద రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా వాటర్ షెడ్ 2.0 పథకానికి ప్రభుత్వం వచ్చే ఏప్రిల్‌లో శ్రీకారం చుట్టనున్నది. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే 20 జిల్లాల్లోని 34 క్లస్టర్లలో మొత్తం 1.41 లక్షల హెక్లార్లను ఎంపికచేశారు. ఈ పథకం కింద రానున్న ఐదేండ్లలో రూ.357.65 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పథకంలో ప్రధానంగా ఫాంపాండ్స్, చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్‌డ్యాం తదితర పనులను చేపడుతారు. వీటితో పాటు రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు, పరికరాల కొనుగోలుకు 75 శాతం సబ్సిడీని అందజేస్తారు. చిన్న రైతుల ఆదాయం పెరిగే విధంగా జీవనోపాధులను కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో డీఆర్డీవోలు పర్యవేక్షిస్తారు. పథకం అమలుపై సమగ్ర నివేదికలను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వాటర్ షెడ్ 2.0 పథకంలో చేపట్టే కార్యక్రమాలు
సహజ వనరులను వినియోగించుకోవడం, పరిరక్షించడం, అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరింపజేస్తారు.
శాస్త్రీయ విధానం ద్వారా వ్యవసాయోత్పత్తి, ఉత్పాదకత, రైతుల ఆదాయం పెంపుదలకు చర్యలు చేపట్టనున్నారు.
పశువుల పెంపకం, నిర్వహణ నిమిత్తం నిరుపేద రైతులకు తక్కువ వడ్డీతో ఆర్థిక సాయం అందజేస్తారు. వీటికి అవసరమైన నిధులను సెర్ప్‌కు బదిలీ చేసి వారి ద్వారా రుణ సహాయాన్ని అందిస్తారు.
టైలరింగ్, కిరాణ, ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సాయాన్ని తక్కువ వడ్డీకి అందజేస్తారు.
వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసే పనులకు యూనిట్ కాస్ట్‌గా హెక్టారుకు సాధారణ నేలలకు రూ.22 వేలు, గుట్టలు, ఎత్తైన ప్రదేశాలు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల రూపాయలుగా
నిర్ణయించారు.
భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యధికంగా నాలుగు క్లస్టర్ల చొప్పున ఎంపికయ్యాయి.
13 అంశాలను ప్రాతిపదికన తీసుకొని క్లస్టర్లను ఎంపిక చేశారు.