హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పలు దఫాలుగా ఇప్పటికే నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం ఆదివారం నుంచి నిరంతరాయంగా లిఫ్ట్ చేయాలని నిర్ణయించింది. గాయత్రి పంప్‌హౌస్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 14 రోజుల పాటు నీటిని లిఫ్ట్ చేయనున్నారు.
అందుకు 150 మెగావాట్ల కరెంట్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. శనివారం విద్యుత్తు శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆ శాఖ అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ లిఫ్ట్ సీముల నుంచి నీటి ఎత్తిపోతలకు అవసరమయ్యే కరెంట్ డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు.
నంది పంప్‌హౌస్‌లో 2 మోటార్లు, గాయత్రి పంప్‌హౌస్‌లోని రెండు పంపులు, అన్నపూర్ణ రిజర్వాయర్‌లోని తిప్పాపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ 10)లోని మూడు పంపులు, రంగనాయకసాగర్లోని చంద్లాపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ 11)లో మూడు పంపులు, మల్లన్నసాగర్ (ప్యాకేజీ 12)లోని తుకాపూర్లో 8 పంపులను నడపనున్నారు.