హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టులు పూర్తిగా నిండకముందే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి కృష్ణాజలాల మళ్లింపును ఏపీ సర్కార్ అప్పుడే ప్రారంభించింది. దీని ద్వారా తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్వయంగా ఆదివారం నీటి విడుదలను ప్రారంభించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఇతర ప్రాజెక్టులు నిండకముందే ఏపీ సర్కారు నీటి మళ్లింపు నిర్వాకానికి దిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది వరద ముందుగానే మొదలైంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 180 టీఎంసీలకు చేరుకున్నది.
నాగార్జున సాగర్‌కు ఇప్పుడిప్పుడే వరదనీరు దిగువకు చేరుతున్నది. ఏపీ ప్రభుత్వం 2024-2025లో కృష్ణా జలాల్లో తన తాత్కాలిక వాటా 66 శాతానికి మించి ఏకంగా 72 శాతం మేరకు జలాలను మళ్లించుకున్నది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి ఏపీకి కేవలం తెలుగుగంగ 15, ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు కలిపి మొత్తంగా 34 టీఎంసీలు కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నిరుడు ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే దాదాపు 240 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వరద జలాల వినియోగంపై ఇప్పటికీ దృష్టి సారించలేదు. ఫలితంగా రైతులకు పడిగాపులు తప్పడం లేదు.