హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రాజెక్టులకు అదనపు నీటివనరులు అందుబాటులో ఉన్నాయని, అలా పొదుపు చేసిన జలాలను తెలంగాణకు కేటాయించవచ్చని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో గత రెండు రోజులుగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న విచారణ బుధవారం కూడా కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలను కొనసాగించారు. తెలంగాణ నీటి అవసరాలను ట్రిబ్యునల్‌కు వివరించారు. పునఃపంపిణీ వల్ల ఏపీ తన నీటి వాటాను కోల్పోదని, రెండు రాష్ట్రాల మధ్య సమానమైన, న్యాయమైన రీతిలోనే జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతున్నదని స్పష్టం చేశారు.
తాత్కాలిక వాటా కింద ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 323 టీఎంసీలను అంతర్గత ఏర్పాటులో భాగంంగా అవతలి బేసిన్‌కు మళ్లిస్తున్నదని, బేసిన్ లోపల 189 టీఎంసీలను మాత్రమే వినియోగిస్తున్నదని తెలిపారు. 75% డిపెండబుల్ జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలను కేటాయించడం వల్ల ఏపీపై ఎలాంటి ప్రభావం ఉండబోదని చెప్పారు. ఏపీ ప్రాజెక్టులకు అదనపు వనరులు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ.. కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్)కు కాలువల ద్వారా 43.2 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మళ్లించడం ద్వారా 80 టీఎంసీలతోపాటు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నుంచి కూడా గోదావరి జలాలను కేడీఎస్‌కు మళ్లిస్తున్నదని వివరించారు. తీవ్రమైన లోటు ఏర్పడిన 2023-24 నీటి సంవత్సరంలో కూడా కేడీఎస్ దాదాపు 125 టీఎంసీలను ఉపయోగించుకుందని వెల్లడించారు. ఆ సమయంలో శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లోలు కేవలం 145టీఎంసీలు మాత్రమేనని, 125 టీఎంసీల్లో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా దాదాపు 40 టీఎంసీల గోదావరి జలాలను కేడీఎస్‌కు మళ్లించారని తెలిపారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు 150 టీఎంసీ సామర్థ్యంతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువను రూపొందించారని, ఆ మేరకు కేటాయింపుల కోసం ట్రిబ్యునల్-1ను ఉమ్మడి ఏపీ సర్కారు ఒత్తిడి చేయలేదని, బేసిన్ అవతలి ప్రాజెక్టులకు కేటాయింపుల కోసం పట్టుబట్టిందని వివరించారు. తాజా సెషన్లో 3 రోజులపాటు కొనసాగిన విచారణ బుధవారం ముగిసింది. దీంతో తదుపరి సెషన్ విచారణను ఏప్రిల్ 15 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్టు ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్ కుమార్ ప్రకటించారు.
కాంగ్రెస్ సర్కార్ జల దోపిడీ ; సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత మధు
ఇల్లెందు, మార్చి 26 : ఏజెన్సీ ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతున్నదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తలాపున గోదావరి జలాలను పెట్టుకొని ఏజెన్సీ ప్రాంతవాసులు తాగు, సాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తున్నదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఏజెన్సీ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీటిని మైదాన ప్రాంతానికి, మిగిలిన నీటిని ఆంధ్రాకు తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.