హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం 93.5 మీటర్ల ఎత్తుకుపైగా నీళ్లు ప్రవహిస్తున్నందున కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీటిని ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మేడిగడ్డ వద్ద ఉన్న పరిస్థితి అన్నారం, సుందిళ్లలో లేదని, బరాజ్‌లు సురక్షితంగా ఉన్నాయని స్పష్టంచేశారు. ప్రవహిస్తున్న నీటి నుంచి వీలైనంతవరకు టీఎంసీ నుంచి 2 టీఎంసీలు ఎత్తిపోసి అన్నారంలో కొంతవరకు నిల్వ ఉంచి అక్కడి నుంచి సుందిళ్లకు తరలించవచ్చని చెప్పారు. అన్నారం బరాజ్ కెపాసిటీ 8 టీఎంసీలని, ఇందులో కనీసం 4 టీఎంసీలు నింపినా పంప్లెవల్ వరకు నీళ్లు వస్తాయని, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని తెలిపారు. సీఎం చెప్పినట్టు అన్నారం, సుందిళ్ల కొట్టుకుపోవడం జరుగదని అన్నారు. ప్రస్తుత ప్రవాహం ఆధారంగా కనీసం 25 టీఎంసీలను మిడ్‌మానేర్‌కు తరలించవచ్చని, చెరువులు, కుంటలను నింపవచ్చని వివరించారు. ప్రతిపక్షాలు లెవనెత్తాయనే అంశం పక్కనబెట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రాణహితలో వస్తున్న లక్ష క్యూసెక్కుల ప్రవాహంలోంచి కొంతమేర నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు పేరు వస్తుందని భావించి ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దన్నారు.