హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొమ్మిదేండ్ల పరిపాలన ట్రైలరే అని, అసలు సినిమా ముందున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామావు అన్నారు. సీఎం కేసీఆర్ వద్ద ఇంకా అనేక ప్రణాళికలు ఉన్నాయని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందనున్నదని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 100 సీట్లతో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యాలయాన్ని గురువా రం మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది అని తెలిపారు. హాలీవుడ్ సినిమాలను టాలీవుడ్ కాపీ కొట్టినట్టు తెలంగాణ పథకాలను మోదీ కాపీ కొడుతున్నారని అన్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ బీఆర్ఎస్ పాగా వేస్తుందని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తేల్చి చెప్పారు. తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచే రాష్ర్టాన్ని చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు తెలంగాణ ప్రగతిని వాళ్ల రాష్ర్టాల్లో కోరుకుంటున్నాయని, అందుకే పార్టీని బీఆర్ఎస్గా మార్చి సీఎం కేసీఆర్ దేశమంతటా తిరుగుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో అద్భుతమైన భవనాలను చూసి 22 ఏండ్ల తర్వాత వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇది హైదరాబాద్ నగరమా? నూయార్క్ నగరమా? అని ఆశ్చర్యపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలో వంద దేశాలు తిరిగిన ఆయన ఆ మాట అనటం, ఫాక్స్‌కాన్ చైర్మన్ రాష్ర్టానికి వచ్చి ఇది భారతదేశమా? అని అనటం.. మన రాష్ట్రం గొప్పదనం ఏమిటో అర్థమవుతుందని అన్నారు. తెలం గాణ ఉన్న టీఎస్‌బీపాస్, టీఎస్ఐపాస్ వంటి విధానాలు ఎక్కడా లేవని చెప్పారు. ఎవరైనా బిల్డింగ్ నిర్మాణానికి కానీ, పరిశ్రమ స్థాపించాలనుకున్నా ఈ రెండు పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, 21 రోజుల్లోనే అనుమతు లు లభిస్తాయని చెప్పారు. దేశంలో కాదు ప్ర పంచంలోనే ఇలాంటి విధానాలు లేవన్నారు.
హైదరాబాద్ నగరం మాది అని చెప్పుకోవడానికి మనమే కాకుండా, మన పిల్లలు కూ డా గర్వపడుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పా రు. తెలంగాణ ఏర్పడిన సమయంలో ఎన్నో అనుమానాలు, అపోహలు ఏర్పడ్డాయని, నిర్మాణ రంగంలో ఉన్నవాళ్లు చాలా కంగారు పడ్డారని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ నిర్మాణరంగ సమస్యలను ఏకకాలంలో దాదాపు 7 జీవోలతో పరిష్కరించాలని తెలిపారు. బలమైన నాయకుడి వల్లే తెలంగాణలో ఈ స్థాయి అభివృద్ధి జరిగిందని చెప్పారు.
హైదరాబాద్‌లో మంచినీటి, కరెంట్ సమస్యలను పరిష్కరించామని, రహదారి వ్యవస్థ బలోపేతం, ఎస్ఆర్డీపీతో 35 ప్రాజెక్టులు తీసుకువచ్చినట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. నగరం నలువైపులా అభివృద్ధి చెందుతున్నదని, అందుకు తగ్గట్టు ఫార్మా, ఏరో స్పేస్, పరిశ్రమలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. మెట్రోతో పాటు జీనోమ్ వ్యాలీ సేవలను పెం చుతామని అన్నారు. మెట్రో 250 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని, జూబ్లీ బస్టాండ్ నుంచి తుర్కపల్లి, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు స్కైవేల మధ్యలో మెట్రో పిల్లర్లు కట్టి స్కైవేల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ప్రస్తు తం నగరంలో 3,800 ఆర్టీసీ బస్సులు ఉం డగా, వెయ్యి బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చామని, త్వరలో మరో వెయ్యి మార్చుతామని చెప్పారు. ఎస్ఎన్డీపీ తొలి దశ పూర్తి దశకు చేరుకున్నదని, త్వరలో రెండో దశను చేపడతామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మురుగునీటిని 100 శాతం శుద్ధిచేసిన తొలి నగరంగా హైదరాబాద్ అవతరిస్తుందని అన్నారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలను విస్తరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్మన్, క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ మాజీ చైర్మన్ జీ రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు డీ మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఉన్న తేడా ఏమి టో మంత్రి కేటీఆర్ వివరించారు. ‘చంద్రబాబు ఐటీ, బిజినెస్ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునేవారు. వైఎస్ఆర్ రైతులు, సంక్షేమం, పేదలపై దృష్టి పెట్టారు. వారిద్దరూ కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ర్టాన్ని పాలించారు. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే, మరోవైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని మరువలేదు. క్యాబ్ డ్రైవర్ నుంచి ఇతర దేశాల పారిశ్రామికవేత్తల దాకా అంతా తెలంగాణ అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 143 కోట్ల జనాభా కలిగిన దేశంలో కేవలం 4 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం తెలంగాణ. 3 శాతం కంటే తక్కువగా ఉన్న తెలంగాణ 30 శాతం జాతీయ పంచాయతీ అవార్డులను కైవసం చేసుకుందంటే మామూలు విషయం కాదు. గత సీఎం సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి సాధించలేనిది కేసీఆర్ ఒక్కరే చేసి చూపించారు. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి తెలంగాణ మాడల్‌గా నిలుస్తుంది. రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది’ అని వివరించారు.
బీఆర్ఎస్కు 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లు వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 95-100 సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారం చేపడతామని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కుల, మత పంచాయితీలు లేకుండా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సింది ప్రజలే అని అన్నారు. అభివృద్ధి కోసం అప్పు చేస్తే తప్పేముందన్న ఆయన.. ఆ డబ్బును ఉత్పత్తి రంగంలో పెట్టామని వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారమే అప్పు చేస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.