కృష్ణకాలనీ, ఏప్రిల్ 11 : దళితులమనే కారణంతో పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకుంటే మున్సిపల్, సింగరేణి, రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి వచ్చి జేసీబీలతో కూల్చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గడ్డిగానిపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం గ్రామస్థులు సెగ్గం సిద్దు, చల్లూరి సమ్మయ్య తదితరులు మీడియాతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. 2008లో సింగరేణి సంస్థ కేటీకే ఓసీ-2 కింద గడ్డిగానిపల్లిలోని భూములను తీసుకొని, గ్రామాన్ని ఇకడి నుంచి వేరే చోటుకు తరలిస్తామని ఒప్పందం చేసుకున్నదని తెలిపారు. ఇకడ ఇప్పటివరకు నిర్మించిన ఇండ్లకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని, ఇకమీదట ఇండ్లు కట్టవద్దని, కట్టిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వమని నాటి నుంచి ఇబ్బందిపెడుతున్నారని, తమ భూములన్నీ సింగరేణి లాక్కున్నదని ఆరోపించారు.
కానీ, 2008 నుంచి ఇప్పటివరకు ఎంతో మందికి వివాహాలై వేరే కాపు రం పెట్టుకున్నారని, ఈ క్రమంలో వేరు పడ్డ తమ పిల్లల కుటుంబాలు నివసించడానికి ఇండ్లు ఉండాలని, సింగరేణి స్వాధీన పరుచుకున్న భూముల్లో కాకుండా పకకు ఉన్న తమ పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నట్టు తెలిపారు. ఇది చూసి ఓర్వలేని అధికారులు బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత భారీ పోలీసు బలగాలతో వచ్చి ఈ ఇండ్లకు అనుమతి లేదని కూల్చి వేశారన్నారు. తమకు పరిహారం చెల్లించే వరకు ఓసీ- 2లో పనులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.