ముస్తాబాద్, మే 1 : తాగునీటి కోసం తమ వార్డు ప్రజలు అల్లాడుతుండటాన్ని చూసి తట్టుకోలేక ఓ వార్డుమెంబర్ పంచాయతీ కార్యాలయంలోనే ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానిక 9వ వార్డులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నదని పలుమార్లు సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో శుక్రవారం వార్డు మెంబర్ సుమలత ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయంలో నిరసన చేపట్టారు.
స్థానికులు నీటి సమస్యపై సర్పంచ్‌ను అడిగితే, వార్డు సభ్యులనే అడుగాలని అంటున్నారని ఆమె మండిపడ్డారు. వార్డులో నీటి సమస్య పరిష్కారానికి బోరు వేయించినా మోటర్ మాత్రం బిగించలేదని విచారం వ్యక్తంచేశారు. వెంటనే మోటర్ అమర్చి నీటి సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.