ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి. దూరం నుంచి వచ్చే పిల్లలకు ఉచిత రవాణా అమలు చేయండి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించండి. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చండి.
– విద్యార్థిని భువనకృతి
Telangana | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కారు బడుల్లోనూ ఐఐటీ జేఈఈ, నీట్ కోచింగ్ ఇప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని విద్యార్థిని భువనకృతి కోరింది. ఐదో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. బడులకు వచ్చేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలని కోరింది. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో సర్కారు బడుల్లో చదివి పదో తరగతిలో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభాపురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లాకు చెందిన భువనకృతికి సర్కారు బడుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించింది. భువనకృతి ప్రసంగం సాగిందిలా ‘ మాది వరంగల్.. కృష్ణాకాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. మా నాన్న కార్పెంటర్‌గా పనిచేస్తారు. కూలినాలి చేసుకొంటేనే గడిచే కుటుంబం మాది. ప్రైవేట్ స్కూళ్లో 5వ తరగతి నుంచే ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ బడుల్లో ఇలాంటి కోచింగ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఐఐటీ, నీట్ కోచింగ్ ఇవ్వాలి. నాణ్యమైన విద్యకోసం పిల్లలు ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ సర్కారు బడులకు వస్తున్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టిసారించాలి.
ఉపాధ్యాయ బదిలీలతో టీచర్లు ఇతర జిల్లాలకు వెళ్లిపోతున్నారు. కొంత మంది రిటైర్మెంట్ అవుతున్నారు. ఆయా పోస్టులను ప్రభుత్వం భర్తీచేయడంలేదు. దీంతో సబ్జెక్టు టీచర్ల కొరత సమస్య వేధిస్తుంది. ఆయా పోస్టులను భర్తీచేసి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలి. బట్టీ విధానం కంటే ప్రాక్టికల్‌గా చదివితేనే ప్రయోజనం. పిల్లలు అర్థం చేసుకోగలరు. నిజ జీవితంలోను ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం సర్కారు బడుల్లో ల్యాబోరేటరీలు, గ్రంథాలయాలు మా ప్రభుత్వ బడుల్లోనూ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చాలా అవసరం. ప్రైవేట్ స్కూల్ పిల్లలు… మీది గవర్నమెంట్ స్కూలా అంటూ హేళనగా మాట్లాడారు. వాళ్లందరు వేలేత్తిచూపేలా మేమంతా 10 జీపీఏ సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాం. 10 జీపీఏ సాధించినవారందరికి ఇంటర్లో చదువుకునేందుకు ఫ్రీ సీటు ఇప్పించండి’ అంటూ భువనకృతి సభాముఖంగా సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.