ఎంజీఎం ఘటనలో బాధితుడైన హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ కు తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు వైద్యాధికారులు శ్రీనివాస్‌ను నిమ్స్‌కు తరలించారు. శ్రీనివాస్ కొంత కాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధింత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నాడు.
కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలవడంతో వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరి చికిత్స తీసుకున్నాడు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రాాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను ఎంజీఎం దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమించినప్పటికీ శ్రీనివాస్‌కు వెంటిలేటర్‌పై ఎంజీఎం వైద్యలు చికిత్స అందిస్తున్నారు. అయినా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ విషయం రావడంతో ఆయన ఆదేశాల మేరకు వైద్యాధికారులు శ్రీనివాస్‌ను నిమ్స్ దవాఖానకు తరలించారు. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.