Congress Party | వరంగల్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సభకు ముగ్గురు సీనియర్ మంత్రులు డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మొదటినుంచి దూరంగా ఉంటున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి, మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర్రావు, మరో సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహ బహిరంగ సభకు హాజరుకాలేదు. ముగ్గురు సీనియర్ మంత్రులు ప్రభుత్వ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై కాంగ్రెస్ శ్రేణులు సభలోనే చర్చించుకున్నారు.
‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ సభ ప్రభుత్వ కార్యక్రమమే అయినా అడుగడుగునా కాంగ్రెస్ సభను తలపించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు కనీస నిబంధనలు మరిచిపోయారు. ప్రొటోకాల్ లేని అధికార పార్టీ నేతలు కుర్చీలను ఆక్రమించగా, ప్రజాప్రతినిధులు, అధికారులు కుర్చీలు లేక ఇబ్బందిపడ్డారు. పేరుకు మహిళాశక్తి సభ అయినా మహిళా ప్రతినిధులు, ఉన్నతాధికారులకే కూర్చునే అవకాశంలేకుండా పోయిం ది. స్వాగతోపన్యాసం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికే వేదికపై కుర్చీ లేని దుస్థితి నెలకొన్నది. దీంతో ఆమె వెళ్లి వెనుక వరుసలో పక్కకు కూర్చోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత రామగుండం ఎమ్మెల్యే కుర్చీ ఖాళీ చేయడంతో అప్పుడు శాంతికుమారి వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణికీ ఇదే పరిస్థితి ఎదురైంది. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేయర్ సుధారాణి వేదికపైకి వచ్చారు. ముందు వరుసలో కూర్చునేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు కుర్చీలు ఆక్రమించుకున్నారు. వెనుక కూడా అదే పరిస్థితి ఉండటంతో కొద్దిసేపు నిల్చునే ఉన్నారు. ఆ తర్వాత సిబ్బంది వేరే కుర్చీ తీసుకొనిరావడంతో ఆమె కూర్చున్నారు.
ప్రభుత్వ కార్యక్రమంలో అంతా కాంగ్రెస్ నాయకుల హడావుడి కనిపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వేదికపై ముందు వరుస లో కూర్చున్నారు. కాంగ్రె స్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ, జనగామ నియోజకవర్గ కాంగ్రె స్ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వేదికపై ముందుగానే వచ్చి కూర్చుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వరంగల్‌లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ వేదిక నుంచి 22 జిల్లాల్లోని ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ల క్లినిక్‌ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, బీమా చెక్కులు పంపిణీ చేశారు. టీజీఎస్ఆర్టీసీ-డిస్కంలతో ఎంవోయూ ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క, జూపల్లి, శ్రీధర్‌రాబు, పొన్నం ప్రభాకర్, వెంకటరెడ్డి, ఎంపీలు కావ్య, బలరాంనాయక్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.