హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): వరంగల్ సూపర్ మల్టీస్పెషాలిటీ దవాఖాన నిర్మాణ బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సోమవారం ఎల్అండ్టీ ప్రతినిధులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. అనంతరం పనుల కార్యప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ఇంత గొప్ప నిర్మాణం చేపట్టడం గర్వకారణమని, సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఆర్అండ్బీ తరపున ఈఎన్సీ గణపతిరెడ్డి నోడల్ అధికారిగా ఉంటారని చెప్పారు.
గడువులోగా కొత్త సెక్రటేరియట్
నూతన సెక్రటేరియట్ ప్రపంచం అబ్బురపడేలా ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై సోమవారం ఆర్అండ్బీ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థకు, అధికారులకు ఫ్లోరింగ్, ఇంటీరియర్ పనులపై పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, హఫీజుద్దీన్, వర్క్ ఏజన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్ని తదితరులు ఉన్నారు.
అమరుల త్యాగాల ప్రతిబింబంగా స్మారక చిహ్నం
తెలంగాణ అమరుల త్యాగాలు ప్రతిబింబించే విధంగా హుస్సేన్‌సాగర్ తీరంలో అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నట్టు మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సోమవారం స్మారక చిహ్నం నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి.. పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు.