వరంగల్, ఫిబ్రవరి 26: అభివృద్ధి పనుల సత్వర పూర్తికి వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు పార్టీలకతీతంగా ఒకటయ్యారు. మెజార్టీ ఉన్న బీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సోమవారం వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో వీరంతా సమావేశమ య్యారు. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు సత్వరమే పూర్తి చేసేలా ఒత్తిడి తేవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అధికారులు, మేయర్ కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికై మూడేండ్లవుతున్నా డివిజన్లలో రూ.50 లక్షల పనులు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ గుండు సుధారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. పలు అంశాలపై ఆమెతో వాగ్వాదానికి దిగారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుంటే బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటం ఇచ్చారు. అవసరమైతే అవిశ్వాసానికి వెనుకాడేది లేదని కార్పొరేటర్లు తేల్చిచెప్పారు.