హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : భారత్- పాకిస్థాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 10 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ను నిర్వాహకులు మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పోటీలో పాల్గొనే అందాల భామల భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదన్న అనుమానాల నేపథ్యంలో పోటీల నిర్వహణపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే 70శాతం మంది పోటీదారులు హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో పోటీలను కొనసాగించడమా? లేక షెడ్యూల్ను మార్పు చేయడమా? అనే అంశం మీద మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. దీనిపై గురువారం సాయంత్రానికి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్లో జరిగే 72వ ‘మిస్ వరల్డ్-2025’ పోటీలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.116 దేశాల భామలు పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం సాయంత్రానికి 88 దేశాల పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలిసింది. మరో 28 దేశాల వారు రావాల్సి ఉన్నది. పాకిస్థాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను మొదలు పెట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో దేశంలోని 18 ఎయిర్ పోర్టులను భారత ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. దేశంలో దాదాపు 200 విమాన సర్వీస్లు రద్దయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీలు డైలమాలో పడ్డాయి. పేరు నమోదు చేసుకున్నవారు అందరూ రాకుండా పోటీలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నదని, పోటీదారులతో పాటు, ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించటం కష్టతరంగా మారవచ్చని ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. దీంతో సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన అందాల పోటీలకు వ్యతిరేకంగా నిజామాబాద్లో ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పెట్టుబడిదారులకు ఆదాయం తెచ్చే అందాల పోటీలు నిర్వహించడం మానుకోవాలని సూచించారు. – కంఠేశ్వర్