వనపర్తి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వెన్నుపోటు రాజకీయాలతో వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతున్నదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. చిన్నారెడ్డి చర్యలపై ఏఐసీసీ, టీపీసీసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు రాజకీయాలు నష్టం చేశాయని తెలిపారు.
రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మేరకు సర్పంచ్ స్థానాలు గెలుపొందామని, సొంత పార్టీ నేతలు ద్రోహం చేయకుంటే మరిన్ని స్థానాలు వచ్చేవని వెల్లడించారు. దీనిపై ఆధారాలతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారంతా కొత్త కాంగ్రెస్ మద్దతుదారులే అని స్పష్టంచేశారు. కరెక్ట్ కాంగ్రెస్ ఎవరిదో..? తప్పుడు కాంగ్రెస్ ఎవరిదో..? ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. వనపర్తిలో కాంగ్రెస్లో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అంటూ వర్గవిభేదాలు భగ్గుమన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.