బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు
ఎంతవరకు సబబంటున్న స్థానికులు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్ పరిధిలోని పలు ఆర్మీరోడ్ల మీద ఇకపై సాధారణ పౌరులకు, వాకర్స్‌కు అనుమతి నిరాకరిస్తూ లోకల్ మిలిటరీ అథారిటీ(ఎల్ఎమ్ఎ) అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత 30 ఏండ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రక్షణశాఖ స్థలాల్లోని రోడ్లపై యాప్రాల్తో పాటు స్థానిక బస్తీల వాసులు సుమారు 500 మంది నిత్యం వాకింగ్ చేస్తుంటారు. కానీ రెండు రోజుల క్రితం మిలటరీ అధికారులు నూతన నిబంధనలు తీసుకొచ్చారు. బొల్లారంలోని వలేరియన్ గ్రామర్ హైస్కూల్ పరిసర ప్రాంత రోడ్లపై వాకింగ్ చేయడానికి అనుమతి లేదని, కేవలం ఆర్మీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉన్నట్టు బోర్డులు రాసిపెట్టారు. ఇతరులు ఎవరైనా ఈ ప్రాంత రోడ్లపైకి వస్తే కచ్చితంగా వారు ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ పనిచేసే వారికి సైతం గుర్తింపు కార్డులు ఉండాల్సిందేనని, ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. తాము ఎన్నాళ్ల నుంచో ఇదే ప్రాంతంలో వాకింగ్ చేస్తుంటామని, కొత్తగా మిలటరీ అధికారులు నిబంధనలు పెట్టడం ఎంతవరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా రోడ్లను మూసివేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు వాకింగ్ చేసుకోవడానికి వీలులేకుండా రోజుకో కొత్త నిబంధనలు పెడుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.