Waqf Board Lands | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ సఫిల్‌గూడలోని ద్వారకామయి కాలనీలో 15ఏండ్ల క్రితం ఓ వ్యక్తి 90 గజాల జాగ కొనుగోలు చేశాడు. అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా మార్టిగేజ్ కాదని అధికారులు తేల్చిచెప్పారు. ఎందుకుని ఆరా తీస్తే ఆ భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదని, ఆ భూమి కొనుగోలు, అమ్మకం, రుణం తీసుకోవడంపై నిషేధం ఉందని స్పష్టంచేశారు. అసలు ఆ భూమిపై యాజమాన్య హక్కే లేదని తెలిసింది… మౌలాలీలోని భరత్‌నగర్‌కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి చాలా ఏండ్ల క్రితం 150 గజాల జాగను కొనుగోలు చేశాడు. అక్కడే ఇంటిని నిర్మించుకున్నాడు.
ఇటీవల కూతురు పెండ్లికి అవసరమై ఇంటిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. కానీ అమ్ముకోవడం కుదరదని, ఆ ఇల్లు నిషేధిత సర్వే నంబర్ల జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు తేల్చిచెప్పారు. ఆశలు ఆవిరి కావడంతో అతడు షాక్‌కు గురై మంచానపడ్డాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి, అన్నోజిగూడ, రాంపల్లి, మౌలాలిలోని 20 వేలకు పైగా ఇండ్లు, స్థలాలది ఇదే పరిస్థితి. వీటికి సంబంధించి వక్ఫ్‌బోర్డు సర్క్యులర్ జారీ చేయగా రిజిస్ట్రేషన్లశాఖ నిషేధిత జాబితాలో పెట్టింది. మూడు నెలలుగా వందలాది సర్వే నంబర్ల పరిధిలోని కుటుంబాలు దిక్కుతోచనిస్థితిలో పడిపోయాయి.
హైదరాబాద్‌లోని బడుగు జీవులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసింది. 1989 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వందకు పైగా కాలనీలను వక్ఫ్ బోర్డు తమ ఆస్తులుగా గుర్తించింది. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ఆధారంగా వాటి క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అవసరానికి అమ్ముకోలేక, అప్పులు తీసుకోలేక, అసలు ఆ ఆస్తులే తమవి కాదనే విషయం నమ్మలేక జనం ఆందోళన చెందుతున్నారు. 35 ఏళ్ల క్రితం నాటి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా వక్ఫ్‌బోర్డు ఇప్పుడు సర్క్యులర్ ఇవ్వడం, వెంటనే రిజిస్ట్రేషన్లశాఖ నిషేధిత జాబితాలో చేర్చడంలో ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పలు నిర్ణయాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని వ్యాపారవర్గాలు చెప్తున్నాయి. భాగ్యనగర స్థిరాస్తి రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తూ పెట్టుబడుల ప్రవాహంలో వేగంగా దూసుకుపోతున్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం శాపంగా మారిందని పలు కంపెనీల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఫార్మా సిటీ, మెట్రోఎయిర్పోర్టు వంటి కీలక ప్రాజెక్టుల రద్దు, హైడ్రా, మూసీ కూల్చివేతలు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపాయని చాలా అధ్యయనాలు స్పష్టంచేశాయని గుర్తుచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భూములు, ఇండ్ల కొనుగోళ్లు, అమ్మకాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వాపోతున్నారు. ఈస్ట్ హైదరాబాద్ మరో హైటెక్ సిటీగా మారుతుందని నిపుణులు అంచనా వేశారని, కానీ ఆ ప్రాంతం కూడా నట్టేట మునిగే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. వంద గజాల జాగాను కూడా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మరో ఉదాహరణగా నిలుస్తున్నది. ఎప్పుడో కొనుక్కున్న ఆస్తులను ఇప్పుడు వక్ఫ్ భూములుగా నిర్ధారించడం వెనుక భారీ కుట్ర ఉంది. దశాబ్దాల క్రితమే నిర్మితమైన కాలనీలను వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించడం సరికాదు.
ప్రభుత్వం చొరవ తీసుకుని, సామాన్యుల ఆస్తులను రక్షించాల్సిన అవసముంది. – నారగోని ప్రవీణ్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి
దశాబ్దాల కాలంగా వారసత్వంగా వచ్చిన జాగలను ఇప్పుడు వక్ఫ్ భూములనీ నిర్ధారించడం దారుణం. సామాన్యులు, పేదల ఆస్తులను పరిరక్షించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గా లు చూపాలి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రజలు తీవ్రఆందోళన చెందుతున్నారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిలోనూ ఉంది. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. సామాన్యుల ఆస్తులకు నష్టం లేకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరముంది.
-మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే