Congress | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్ పదవులలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయా?. మంత్రుల అభ్యంతరం, అనుకున్న రీతిలో పార్లమెంట్ ఫలితాలు రాకపోవడం ఈ చేర్పులు, మార్పులకు కారణమా?. దీనివల్లనే జీవోల జారీ జాప్యమవుతున్నదా? అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు 37 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు సమాచారమిచ్చాయి. అయితే షెడ్యూల్ వెలువడి కోడ్ అమలులోకి రావడంతో ఉత్తర్వుల జారీ ఆగిపోయింది. దీంతో ఎన్నికల తర్వాత జీవోలన్నీ గంపగుత్తగా ఒకేసారి విడుదల అవుతాయని పార్టీ పెద్దలు ఆశావహులకు హామీ ఇచ్చారు. దీంతో పదవుల సంబురంలో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ అభ్యర్థుల విజయానికి తమవంతుగా బాగానే కష్టపడ్డారు. ఎన్నికల కోడ్ ముగిసి దాదాపు వారం దాటిపోయింది. కానీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జీవోలు మాత్రం విడుదలకు నోచుకోలేదు.
లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అశించిన ఫలితాలు రాలేదని, కొన్నిచోట్ల నేతలు సరిగా పని చేయలేదని, నామినేటెడ్ పోస్టులకు ఖరారైన వారిలో కొందరు నిర్లక్ష్యం వహించారని పార్టీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు తమను సంప్రదించకుండా, చర్చించకుండా ఏకపక్షంగా నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని కొందరు మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
ఒకరిద్దరు మంత్రులు తమ అసంతృప్తిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వరకు చేరవేశారు. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాల్సి ఉన్నప్పటికీ స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్లనే 12 సీట్ల గెలవాలన్న లక్ష్యం నెరవేరలేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగా ఖరారైన పేర్లలో స్వల్ప చేర్పులు, మార్పులు జరుగుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
మరో 15 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. వీటి భర్తీకి ఇటీవల తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులతో పాటు తాజాగా మరో 15 పోస్టులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీటన్నింటికీ కలిపి ఒకేసారి జీవోలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.
ఓడ దాటాక బోడి మల్లన్న
పార్లమెంట్ ఎన్నికల ముందేమో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చిన పార్టీ పెద్దలు ఇప్పుడు, ఆశించిన మేరకు ఫలితాలు రాలేదని, మంత్రులు అభ్యంతరం చెబుతున్నారని నామినేటెడ్ పోస్టుల భర్తీకి కుంటి సాకులు చెప్పడం, ఖరారైన పేర్లలో చేర్పులు, మార్పులు చేయడం ఏమిటని ఆశావాహులు మండిపడుతున్నారు. పార్టీ పెద్దలు ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.
పార్లమెంట్ ఫలితాలు ఆశించిన మేరకు రాకపోవడానికి తమనెలా బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పలు స్థానాలకు ఎన్నికల ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన మంత్రులను వారి పదవుల నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దకాలంగా అధికారం లేకపోయినా పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హతలేని అనామకులకు పదవుల పందేరం చేస్తే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగక ముందే నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉండటంతో ఈ పోస్టు భర్తీలో ఇక జాప్యం జరుగకపోవచ్చని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు.