Vote for Note | ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని గత నెల 24న నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొనగా.. ఇవాళ జరగాల్సిన విచారణ నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసు విచారణ జరపాల్సిన జడ్జి లీవ్‌లో ఉండటంతో నాంపల్లి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో తాను ఈ విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలిచ్చింది.
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కేవలం అనుమానంపైనే పిటిషన్ వేశారని.. దీనిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలని సూచించింది.