జహీరాబాద్, ఏప్రిల్ 30 : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్తండాను ఉత్తమ జీపీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పంచాయతీ అభివృద్ధి సూచిక (అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) 2.0 నివేదిక ప్రకటించింది. 2023-24 అర్థిక సంవత్సరానికి పేదరికం, జీవనోపాధి, ఆరోగ్యం, మహిళ, శిశుస్నేహపూర్వక, సామాజిక న్యాయం, భద్రత, నీటి సమృద్ధి, స్వచ్ఛత, పచ్చదనం, స్వయంసమృద్ధి, మౌలిక సదుపాయాలు, సుపరిపాలన తదితర అంశాలను పరిగనలోకి తీసుకుని పంచాయతీ పనితీరు ఆధారంగా ఐదు గ్రేడ్లుగా విభజించారు.
2023-24లో విట్టునాయక్ తండాలో కేంద్ర బృందం పర్యటించి ఆయా అంశాల వారీగా పరిశీలించింది. సంబంధిత అధికారుల నివేదికల ప్రకారం రా్రష్ట్రంలోని 12,566 పంచాయతీలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం విట్టునాయక్తండాను ఉత్తమ పంచాయతీగా ప్రకటించింది. ఆన్లైన్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్‌లో ఆయా అంశాల వారీగా విట్టునాయక్తండా 86.41 మార్కులు సాధించడంతో ఉత్తమ పంచాయతీగా ఎంపికైందని సర్పంచ్ చందు, కార్యదర్శి సందీప్ పేర్కొన్నారు.