‘నేపాల్ క్లబ్లో రాహుల్‌గాంధీ చైనా రాయబారితో మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారు.. మరి ఆమెతో దేశరహస్యాలు పంచుకున్నాడా?’ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మామూలు వ్యక్తి కాదని, దేశాన్ని ఏలిన వారి వారసుడన్నారు. మరి ఆయన చైనా రాయబారితో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే దేశ ప్రతిష్టకు ముప్పువాటిల్లిందని ఆందోళన వ్యక్తంచేశారు. గువ్వల బాలరాజు గురువారం మీడియాతో మాట్లాడారు.
గతంలో రేవంత్‌రెడ్డి వైట్ చాలెంజ్ విసిరారని, ఇప్పుడు రాహుల్‌తో వెంట్రుక శాంపిల్ ఇప్పించగలడా? అని సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ముంచేందుకు దిగుమతి చేసుకున్న నేత రేవంత్‌రెడ్డి అని, కాంగ్రెస్ సీనియర్లు దీనిపై ఆలోచించుకోవాలన్నారు. రాహుల్‌గాంధీ వైట్ చాలెంజ్‌కు సిద్ధమైతే..తమ మంత్రి కేటీఆర్ కూడా సిద్ధమేనని గువ్వల బాలరాజు తెలిపారు. దమ్ముంటే రేవంత్‌రెడ్డి ఈ సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఇంతకుముందు రేవంత్‌రెడ్డిని రైఫిల్‌రెడ్డి అని పిలిచేవారని, ఇకనుంచి వెంట్రుకరెడ్డి అని పిలువాల్సి వస్తుందని గువ్వల బాల్‌రాజు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిలాంటి దొంగచేతికి పీసీసీ వెళ్లిందని, అతడు టీ కాంగ్రెస్‌తోపాటు రాహుల్‌గాంధీని కూడా ముంచేస్తాడనిపేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు నిజమైతే రాహుల్‌గాంధీపై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు. చైనా అంబాసిడర్ తో రాహుల్ ఉన్నది నిజమే అని రేవంత్‌రెడ్డి అంటున్నారని, కాదు అని కాంగ్రెస్ వేరే నేతలు అంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు అబద్ధమైతే పీసీసీ అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని గువ్వల బాల్‌రాజు డిమాండ్ చేశారు.