హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ అధ్యయనాల కేంద్రం, మల్టీడిసిప్లినరీ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ కేంద్రం తెలంగాణ ప్రాంతంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంసృతిక, భాషాపరమైన అంశాలను లోతుగా పరిశోధిస్తూ, సమగ్ర అవగాహనను పెంపొందిస్తూ.. ఈ డొమైన్లలో అకడమిక్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంటుందని తెలిపారు. ఈ కేంద్రం రాష్ట్రంపై దృష్టి సారించి లోతైన పరిశోధనలు చేసి, మేధావుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కేంద్రం ఏర్పాటుతో బహుళ అంశాల పరిశోధన సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వారికి అధునాతన పరిశోధన, ఇతర అవకాశాలను అందించడానికి ఈ కేంద్రం దోహదపడుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సవాల్లను పరిష్కరించడంలో కూడా కృషి చేస్తుందని తెలిపారు. అధ్యయనం, పరిశోధనల కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్ యూనివర్సిటీ కూడా విద్యాపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ర్టానికి సంబంధించిన విధాన రూపకల్పన, అభివృద్ధి వ్యూహాలను రూపొందించడంలో విలువైన సమాచారాన్ని, డాటానుకూడా అందించగలదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రత్యేక లక్షణాలు, సవాల్లపై లోతైన అవగాహనను పెంపొందించడం ద్వారా, సామాజిక-ఆర్థిక వృద్ధికి, సాంస్కృతి పరిరక్షణకు ఇతోధికంగా ఈ కేంద్రం దోహదపడగలదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి కేంద్రాలను మిజోరం, రాజస్థాన్, తమిళనాడు రాష్ర్టాలు కలిగి ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఊహించిన విధంగా సమ్మిళిత, సమానమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఈ దృక్పథాన్ని సాకారం చేయడంలో సహాయం చేయాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు.