హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే లిఫ్ట్‌లు అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆరోపించారు. అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే రెండు లిఫ్ట్‌ల ద్వారా ఎల్లంపల్లికి 48 మీటర్లకు నీళ్లను ఎత్తిపోయాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తిస్థాయిలో గ్రావిటీ ద్వారా గోదావరి నీళ్లను తరలించవచ్చని సీఎం చెప్పిన మాటలు సత్యదూరమని కొట్టిపారేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్పడం శుభసూచకమని వ్యాఖ్యానించారు. సర్కారు నిర్ణయాన్ని బీఆర్ఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తుందని స్పష్టంచేశారు.
అయితే మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోని మూడు పిల్లర్లకు తప్ప అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు మరమ్మతు అవసరంలేదని అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు సతీశ్‌రెడ్డి, వాసుదేవారెడ్డితో కలిసి వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల భాగం 6 శాతమేని, వీటికి అయిన ఖర్చు సుమారు రూ.13వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇందులో మేడిగడ్డకు రూ.3,500 కోట్లు వెచ్చించారని వివరించారు. ఇందులో మూడు పిల్లర్ల మరమ్మతుకు రూ. 350 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థనే మరమ్మతు ఖర్చులు భరించాల్సి ఉంటుందని తెలిపారు.
సత్వరమే రిపేర్లు చేపట్టండి
ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మేడిగడ్డ బరాజ్ మరమ్మతు పనులను త్వరగా ప్రారంభించాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. వానకాలం ముగియగానే పనులు మొదలుపెట్టి, ఎండకాలం ముగిసేలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతులకు యాసంగి చివరి పంటలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని వినోద్‌కుమార్ తేల్చిచెప్పారు. గతంలో కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ సాధ్యంకాలేదని గుర్తుచేశారు.