హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి ఉత్సవాలకు సమయం సమీపిస్తున్నది. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు ఉత్సవ సమితి కమిటీ సభ్యులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్ష జరిపి తగిన ఏర్పాట్లు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. సంబంధిత శాఖల మధ్య ఇప్పటివరకు ఎలాంటి సమన్వయ సమావేశాలు నిర్వహించలేదు. ఈ ఏడాది రూ.2.5 కోట్లు వెచ్చించి 5 లక్షల మట్టి గణపతులను పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ వాటి తయారీపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. దీంతో ఈ విగ్రహాల తయారీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? వాటిని సకాలంలో భక్తులకు అందజేస్తారా? అసలు నిజంగానే 5 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారా? అందులో పారదర్శకత ఉంటుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన రంగు విగ్రహాలను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చినందున ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించాల్సి ఉన్నది. 30 సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న 28 బేబీపాండ్స్కు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలే లేవు. దీనిపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులను ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, ఇంకా అనుమతులు రాలేదని సమాధానమిస్తున్నారు. నిజానికి బడ్జెట్ లేకపోవడం వల్లనే బేబీ పాండ్స్ వద్ద పనులు ప్రారంభించలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. ఆదివారం స్వామివారిని 84,060 మంది దర్శించుకోగా 34,985 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న మొకుల ద్వారా హుండీకి రూ. 4.01 కోట్ల ఆదాయం వచ్చింది.