వెల్దుర్తి, జూన్ 2: నాలుగైదు రోజుల నుంచి తాగునీరు లేక గోస పడుతున్నా పట్టించుకుకోవడం లేదంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను అడ్డుకున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో హల్దీవాగు నుంచి మోటార్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బోరు చెడిపోయింది. పంచాయతీలో నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేయించలేదు.
నాలుగైదు రోజుల నుంచి తాగునీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్థులు వ్యవసాయ బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ సోమవారం జాతీయ జెండాను ఎగురవేయడానికి వచ్చిన పంచాయతీ కార్యదర్శి శివశంకర్‌ను అడ్డుకొని తాగునీటి సమస్య పరిష్కరించిన తరువాతే జెండాను ఎగురవేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు తాగునీటిని పునరుద్ధరిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించగా కార్యదర్శి జెండాను ఎగురవేశారు.