రవీంద్ర భారతి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): భాష విషయం లో నాయకుల తీరు మారాలని, ముఖ్యంగా ఈతరం ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఇనగంటి వెంకటరావు రచించిన ‘విలీనం-విభజన’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలని పేర్కొన్నారు. గతంలో బూతులు మాట్లాడిన రాజకీయ నాయకులెవరూ గెలవలేదని గుర్తుచేశారు. బూతులు మాట్లాడే ప్రజాప్రతినిధులను నిలువరించాలని ఓ మహిళ తనతో అన్నట్టు గుర్తుచేసుకున్నారు. పోలింగ్ బూత్‌ల ద్వారా బూతు నాయకుల నోళ్లు మూయించాలని ఆమెకు తాను చెప్పినట్టు పేర్కొన్నారు. సమాజంలోని అవినీతిని జర్నలిస్టులు ప్రజలకు వివరించాలని సూచించారు. నిజాన్ని వారు తెలియజేసి తీర్పును మాత్రం ప్రజలకే వదిలేయాలని చెప్పారు. పత్రిక సమాజానికి దర్పణం లాంటిదని, సమాజంలో ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాత్రికేయులదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు కట్టా శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.