హైదరాబాద్ : వినియోగదారుల కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్‌లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయ డెయిరీ ఆధ్వర్యంలో నూతనంగా ఉత్పత్తి చేసిన 10, 20 రూపాయలు, 50 ML గల స్పెషల్ గ్రేడ్ అగ్ మార్క్ నెయ్యి ప్యాకెట్లను మంత్రి మార్కెట్ లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలలో విజయ డెయిరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పెద్ద ఎత్తున ఔట్ లెట్ల ఏర్పాటు, ట్రై సైకిల్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
రానున్న రోజులలో నూతన ఉత్పత్తులు అనేకం మార్కెట్ లోకి తీసుకొచ్చి నూతన ఔట్ లెట్ లను మరిన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మార్కెటింగ్ జీఎం మల్లికార్జున్, అధికారులు మల్లయ్య, కామేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అధర్ సిన్హాను సన్మానించిన మంత్రి..
ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా ను మంత్రి తలసాని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో అధర్ సిన్హా ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.