హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుండటం, నానాటికీ గానుగ నూనె విక్రయాలు ఊపందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ విజయ బ్రాండ్ పేరుతో గానుగ నూనెను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. స్వచ్ఛమైన గానుగ నూనె తయారీ కోసం హైదరాబాద్ శివారు శివరాంపల్లిలోని ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీలో ప్రత్యేక మిషనరీని ఏర్పాటు చేశారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ నూనెను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. వేరుశనగల ద్వారా గానుగ నూనెను తయారు చేస్తామని, దీని ధర కిలో రూ.280గా నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే విజయ వేరుశనగ, సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్ ఆయిల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, గానుగ నూనె కూడా ఆదరణ పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.