Vijay Madduri | హైదరాబాద్: తాను చెప్పని మాటలను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి (Vijay Madduri) ఆవేదన వ్యక్తంచేశారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆదివారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ ‘నా మిత్రుడు రాజ్ పాకాల మమ్మల్ని కుటుంబ సమేతంగా దీపావళి పండుగ కోసం ఆహ్వానించారు. అక్కడ ఎలాంటి ఇల్లీగల్ అక్టివిటీస్ జరగలేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం.. మేం ఎటువంటి తప్పూ చేయలేదు. కొద్ది రోజుల క్రితమే మేము ప్రపంచ పర్యటన చేసుకొని ఇండియాకు వచ్చాం. వాటి ఆధారాలను కూడా పోలీసులకు చూపించాం. అయినా వాళ్లు ఎఫ్ఐఆర్లో నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్టుగా రాస్తున్నారు. నేను అమెరికన్ సిటిజన్‌ను. 30 ఏండ్లకు పైగా సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం ఉన్నవాడిని. తప్పుడు ప్రచారంతో నా ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు. నిజాలు తప్పకుండా బయటకు వస్తయ్’ అంటూ వివరించారు.