హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. మానవ తప్పిదం వల్లే డ్యామేజీ జరిగినట్టు ఓ అంచనాకు వ చ్చారని సమాచారం. ముఖ్యంగా కాంక్రీట్, స్టీల్‌లో నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. 2019లోనే మేడిగడ్డ డ్యామేజీ అయినట్టు తేల్చింది. మేడిగడ్డ ప్రారంభమయ్యాక మొద టి వరదకే పగుళ్లు బయటపడ్డాయని అంచనాకు వచ్చారు.
పగుళ్లను రిపేర్ చేయాలంటూ.. వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్అండ్టీకి లేఖ రాశారని, ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని గుర్తించినట్టు సమాచారం. వర్షాకాలంలో రిపేర్లు సాధ్యం కాదని ఎల్అండ్టీ అధికారులు తేల్చారని, తర్వాత వచ్చిన వరదలకు కొన్ని పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, వాటిని అధికారులు సకాలంలో గుర్తించకపోవటం తో డ్యామ్ ప్రమాదంలో పడినట్టు నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.
ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని రికార్డులు మాయమయ్యాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రాజెక్టు పిల్లర్లు, బ్లాక్స్‌లో నాణ్యతపై శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే, ఇప్పటి వరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారణ జరిపామని, త్వరలో పంప్హౌజ్లపై కూడా విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు.