Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో మూడోసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. టీయూకు వచ్చిన అధికారులు పరిపాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పలు రికార్డులను పరిశీలించారు. వీసీ రవీందర్గుప్తా హయాంలో ఈసీ అనుమతి లేకుండా రిజిస్ట్రార్లుగా కొనసాగిన ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధినితో పాటు మరో ఎనిమిది మంది అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు విజయలక్ష్మి, సాయాగౌడ్, సూపరింటెండెంట్ భాస్కర్, ఏఈ వినోద్, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కవితా తోరణ్, జూనియర్ అసిస్టెంట్ మధులిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ శాంతాబాయిని నిధుల దుర్వినియోగం, పాలకమండలి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వస్తువుల కొనుగోళ్లు చేయడంపై విచారించారు. రిజిస్ట్రార్లుగా ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధిని కొనసాగిన సమయంలో జరిగిన కొనుగోళ్లపై వారిని వేర్వేరుగా సుమారు 3 గంటల పాటు అధికారులు విచారణ సాగింది.
ప్రొఫెసర్ విద్యావర్ధిని కేరీర్ అడ్వాన్స్ స్కీం పేరిట రూ.11 లక్షల డ్రా చేసుకున్నారన్న ఆరోపణలపై అధికారులు వివరాలు అడిగినట్లు సమాచారం. వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్గుప్తా నియామకం నుంచి ఆయన ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లే వరకు జరిగిన వస్తువుల కొనుగోళ్లపై విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో వీసీ రవీందర్గుప్తా పాలకమండలి ఆమోదం లేకుండా ఇష్టానుసారంగా అక్రమ వస్తువులు కొనుగోళ్లు చేస్తున్నారని, వీసీపై చర్యలు తీసుకోవాలని ఈసీ సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో మొదటిసారి జూన్ 6న అధికారులు సోదాలు నిర్వహించారు. రెండో దఫా జూన్ 13న వర్సిటీలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన వివరాలు రాబట్టారు. జూన్ 17న ఏసీబీ అధికారులు పరీక్షల నియంత్రణ అధికారిణి ప్రొఫెసర్ అరుణ కార్యాలయంలో సోదాలు నిర్వహించి టీయూ పరిధిలోని కళాశాలల వివరాలను అధికారులు సేకరించారు. తదనంతరం విజిలెన్స్ అధికారులు బుధవారం వర్సిటీకి ఉదయం 11 గంటలకు చేరుకుని అధ్యాపకులు, రిజిస్ట్రార్లను విచారణ జరిపారు.