రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామకంలో అవినీతి అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మరోసారి శనివారం తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు సమాచారం. కాగా రెండు రోజుల క్రితం సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిరిసిల్లకు వచ్చి ఆర్డీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తాజాగా, శనివారం కూడా సుమారు రెండు గంటలపాటు రికార్డులను పరిశీలించి, అధికారులను విచారించినట్టు తెలిసింది. జిల్లాలో పదేండ్ల కిందట మహిళా సంఘాలకు 17 దుకాణాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది.
ఆర్థిక పరిపుష్టి సాధించడంతోపాటు పేదలకు బియ్యం పంపిణీలో పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో మహిళలను రేషన్ డీలర్లుగా నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, స్థానిక నేతలు వాటిని రద్దు చేయించి, కొత్తగా ఖాళీ అయిన వాటితో కలుపుకొని మొత్తం 58 దుకాణాలకు నోటిఫికేషన్ వేయించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అధికారులు.. కొనసాగుతున్న డీలర్షిప్లను రద్దు చేసి ఇటీవల రాతపరీక్షలు, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. రద్దు చేసిన 17 దుకాణాల్లో రెండింటిని వదిలి 15 దుకాణాలను కొత్తవారికి కేటాయించారు. రాతపరీక్షకు 830 మంది దరఖాస్తు చేసుకోగా, 765 మంది పరీక్షలు రాశారు. పరీక్షలు నిర్వహించిన అధికారులు పేపర్లమీద ఇన్విజిలేటర్ల సంతకాలు తీసుకోలేదని, మార్కుల జాబితా బోర్డుపై ప్రదర్శించకుండానే అభ్యర్థులను ఎంపిక చేశారంటూ విమర్శలు వచ్చాయి.