హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై సీసీఎల్ఏ అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నా రు. ఇప్పటివరకు జరిగిన పురోగతిని సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరుదశల్లో సమీక్ష జరుగనున్నది. కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
స్పెషల్ డ్రైవ్ ఉన్నట్టా? లేనట్టా?
ధరణిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. తొమ్మిది రోజుల్లో రెండున్నర లక్షల దరఖాస్తులు పరిష్కరిస్తామని హడావుడి చేసింది. తర్వాత గడువును మరికొన్ని రోజులు పొడిగించింది. చివరికి ఎన్నికల కోడ్ పేరుతో డ్రైవ్‌ను మధ్యలోనే నిలిపివేసింది.దరఖాస్తుల పరిష్కారానికి ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని నిపుణులు చెప్పారు.
ఈ విషయంలో ధరణి కమిటీ సభ్యులకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు సమాచారం. తాజాగా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారు. గతంలో ఆపిన స్పెషల్ డ్రైవ్‌ను తిరిగి కొనసాగిస్తున్నారా? లేదా సాధారణ ప్రక్రియగా పూర్తిచేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. తమకు స్పెషల్ డ్రైవ్ అని ఏమీ చెప్పలేదని, దరఖాస్తులు పరిష్కరించాలని మాత్రమే చెప్పారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. స్పెషల్ డ్రైవ్ అని 3నెలల సమయం ఎందుకు వృథా చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.