హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : జీవో నంబర్ 58కి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 కింద పట్టాల పంపిణీ ప్రారంభించి మార్చి చివరి వరకు పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం మున్సిపల్‌శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న కలెక్టర్లను అభినందించారు. ఇప్పటి వరకు 25 రోజుల్లో 51.86 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 9 లక్షల రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2023-24లో పెద్ద ఎత్తున మొకలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, మున్సిపల్‌శాఖ కమిషనర్ సత్యనారాయణ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేతామెహంతి, పీసీసీఎఫ్ డోబ్రియల్, హార్టికల్చర్ డైరెక్టర్ హన్మంతరావు, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణపై..
వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల భవన సముదాయాల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదాలపై ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో కమర్షియల్ కాంప్లెక్స్‌లలో అగ్ని ప్రమాద నివారణ పరికరాలను, హెచ్చరికల అలారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేలుడు పదార్థాలను నిల్వ చేయొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి,సిటీ చీఫ్ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ఫైర్ సర్వీస్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య పాల్గొన్నారు.