బంజారాహిల్స్, మే 16: తమకు ఇచ్చిన గడువు పూర్తయినా నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించడం లేదని బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని వాసవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ కార్యాలయానికి శనివారం పెద్దసంఖ్యలో బాధితులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బాచుపల్లిలో వాసవీ సంస్థ చేపట్టిన వాసవీ అర్బన్ ప్రాజెక్టులో వందలాదిమంది వినియోగదారులు రూ.70 నుంచి 80 లక్షల వరకు చెల్లించి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు.
డిసెంబర్ 2024లోగా ప్రాజెక్టును పూర్తిచేసి ఓనర్లకు ఫ్లాట్స్ అప్పగిస్తామని అగ్రిమెంట్లో పేర్కొన్న వాసవీ సంస్థ, నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తిచేయకపోవడంతోపలుమార్లు ఆందోళనలు చేపట్టారు. పలువురు గతంలోనే రెరాకు ఫిర్యాదు చేయగా.. కొవిడ్, ఇతర సమస్యల కారణంగా నిర్ణీత గడువులో ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయామని, ఎట్టి పరిస్థితిలో జూన్ 2025లో ఫ్లాట్స్ అప్పగిస్తామని హామీ ఇచ్చిన నిర్వాహకులు మరోసారి మాట తప్పారు. దీంతో నెలరోజుల క్రితం బాధితులు ఆందోళన చేయడంతో జూన్ 2026లోగా అప్పగిస్తామంటూ గడువు విధించారు.
గడువు సమీపిస్తున్న తరుణంలో పనులు జరుగకపోవడంతో ఆందోళనకు గురైన సుమారు 50 మంది ఫ్లాట్స్ ఓనర్లు శనివారం సంస్థ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం గేటు వద్ద సుమారు అర్ధగంటపాటు ఆందోళన చేశారు. దీంతో సంస్థ ప్రతినిధులు వారిని లోనికి తీసుకెళ్లి సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. బెంగాల్ ఎన్నికల కారణంగా కూలీలు వెళ్లిపోయారని, త్వరలోనే పనులు పూర్తిచేసి ఫ్లాట్స్ అప్పగిస్తామని సంస్థ డైరెక్టర్లు అభిషేక్, సంజీవ్ నచ్చజెప్పారు. ఎట్టిపరిస్థితిలో జూన్లో తమకు ఫ్లాట్లు అప్పగించాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఫ్లాట్స్ ఓనర్లు హెచ్చరించారు.