కంది, మార్చి 2 : నూతన ఆలోచనలు, ఆవిష్కరణలతో నవీన భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సాంకేతికత ఆవిష్కరణలు దేశ భవిష్యత్తుకు పురోగతి కావాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌ను ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన సతీమణి డాక్టర్ సుదేశ్ ధన్కడ్తో కలిసి సందర్శించారు. ఐఐటీహెచ్ డెరెక్టర్ మూర్తి, ఐఐటీహెచ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేశ్ వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఐఐటీహెచ్ విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత కంపెనీలు గ్లోబల్ లీడర్లతో అన్నిరంగాల్లో పోటీ పడాలని సూచించారు. ప్రస్తుత జనరేషన్ మార్పును దృష్టిలో పెట్టుకొని దేశ కంపెనీలు, సంస్థలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఐఐటీహెచ్ విద్యార్థులు, అధ్యాపకులను ఆయన అభినందించారు. భవిష్యత్తుతరాలకు ఉపయోగపడే మరెన్నో ఆలోచనలు, పరిశోధనలు చేయాలని, నూతన ఆవిష్కరణలతో సత్తాచాటాలని కోరారు. ఓటమిని ఎదుర్కొన్నప్పుడే గెలుపు మజాను పొందవచ్చని విద్యార్థులకు సూచించారు.
డైరెక్టర్ మూర్తి ఐఐటీహెచ్ ఆవిష్కరణలు, ప్రాజెక్టులు, విజయాలను ఉప రాష్ట్రపతికి వివరించారు. ఐఐటీహెచ్ ఆవరణలో ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పేరిట ఉప రాష్ట్రపతి దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, రఘునందన్‌రావు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు అధికారులు స్వాగతం పలికారు.