Veterinary Doctors | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. దవాఖానలకు రాకుండా.. సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతూ.. పశువుల వైద్యాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పశువులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ పశువుల ప్రాణాలను కాపాడుకొనేందుకు రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఉండే పశుసంవర్థక శాఖకు సంబంధించిన గోపాలమిత్రలు కూడా ప్రైవేటు డాక్టర్ల బాటలోనే నడుస్తున్నట్టు తెలిసింది.
వెటర్నరీ డాక్టర్ల అజమాయిషీ కొరవడటంతో గోపాలమిత్రలు పశువులకు వైద్యం చేస్తూ రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పశువులకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ విధంగా వెటర్నరీ డాక్టర్లు, గోపాలమిత్రల నిర్లక్ష్యంతో పశువులు బలికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికాలంగా ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం మరో శాపంగా మారింది. పశు సంవర్ధక శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నది. పూర్తికాలం వెచ్చించే మంత్రి లేకపోవడంతో శాఖపై పర్యవేక్షణ, అజమాయిషీ కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దవాఖానకు వచ్చేది లేదు..
సీనియర్ వెటర్నరీ డాక్టర్లు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వేతనం అందుకుంటున్నారు. రాష్ట్రంలోని వెటర్నరీ డాక్టర్లలో 50-60% మంది సరిగ్గా విధులకు హాజరుకాకుండా, నెలల తరబడి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారంలో, మరికొందరు ఇతర బిజినెస్‌ల్లో మునిగితేలుతున్నారనే విమర్శలున్నాయి. ఈ తంతు ముఖ్యంగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా ఉన్నట్టు తెలిసింది. మెదక్ ప్రాంతానికి చెందిన ఒక వెటర్నరీ డాక్టర్ దవాఖానకు రాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. భువనగిరి జిల్లాలో ఓ ‘కిరణం’, రంగారెడ్డి జిల్లాలో ఓ ‘రామా’ దవాఖానలకు రాకుండా సొంత వ్యాపారాలు చేస్తున్నట్టు తెలిసింది. మల్లేపల్లి, దేవరకొండ మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
వెటర్నరీ డాక్టర్ల ఆగడాలకు జిల్లా వెటర్నరీ అధికారుల అండదండలు ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. విధులకు డుమ్మా కొడుతున్న డాక్టర్లు.. జిల్లా అధికారులకు ప్రతి నెలా ఇంత అని ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, విధులకు రాకపోయినా హాజరు వేస్తున్నారని సమాచారం. దీంతో డుమ్మా కొడుతున్న డాక్టర్లకు ప్రతి నెలా ఠంచనుగా జీతం అందుతుండటం కొసమెరుపు. పశువులకు వేయాల్సిన వివిధ రకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాలను కూడా సరిగ్గా నిర్వర్తించడం లేదని తెలిసింది. ఏదో తూతూ మంత్రంగా చేసేసి, రికార్డుల్లో దొంగ లెక్కలు నమోదు చేసి మిగిలిన వ్యాక్సిన్లను చెత్తపాలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.