హైదరాబాద్ : పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్లు, పారా వెటర్నరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని తెలంగాణ పశు వైద్యుల పట్టభద్రుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు డాక్టర్ కాటం శ్రీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశు భవన్లో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వీ లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. భారత పశువైద్య మండలి నియమాల ప్రకారం.. పశుసంవర్ధక శాఖను అత్యవసర విభాగంగా గుర్తించాలన్నారు. వెటర్నరీ డాక్టర్లతో పాటు మిగతా సిబ్బంది అందరికీ ఉచితంగా కొవిడ్ టెస్టులు చేయించి, టీకా ఇవ్వాలని వారు కోరారు. ఇందుకు డైరెక్టర్ లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారని, తమ వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్లు శ్రీధర్ పేర్కొన్నారు.