MLAs Defection | హైదరాబాద్, నవంబర్21 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యు లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్‌జడ్జి సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును కొట్టేయాలని దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12న వాదనలు ముగించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించనుంది.సింగిల్‌జడ్జి తీర్పును రద్దు చేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదించారు. దీనిపై బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాదులు మోహన్‌రావు, జే రామచందర్‌రావు ప్రతివాదనలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సింగిల్‌జడ్జి జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు వెళితే స్పీకర్‌కు పిటిషన్ తీసుకోలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తను విడుదల చేయాలి
హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యకర్త నలగాటి ప్రసాద్‌రాజును వెంటనే విడుదల చేయాలని మానవ హకుల వేదిక తెలుగు రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్‌కుమార్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రాంతంలో నివాసముంటున్న ప్రసాద్ రాజును గురువా రం తెల్లవారుజామున మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకెళ్లారని, ఆయన భార్య విజయలక్ష్మి(ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) ఫిర్యాదు చేసిందని తెలిపారు. తన భర్త బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆయనపై ఏ కేసులూ లేవని, ఆయన భద్రతపై భయాందోళనగా ఉన్నదని విజయలక్ష్మి తమను ఆశ్రయించినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రసాద్‌రాజును వెంటనే మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.