హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. శక్తికి మించి అప్పులు చేసి.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో మంగళవారం మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయ నేతల వ్యవహారం, ప్రభుత్వాల ప్రాథమ్యాలు, తప్పొప్పులు, పర్యవసానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల తీరుతెన్నులను తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. అందులో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై తనదైన శైలిలో సెటైర్లతో వెంకయ్య విరుచుకుపడ్డారు.
“ఆ మధ్య తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి.. ఒకటో తారీఖు జీతాలివ్వలేను. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదని బహిరంగంగా చెప్పారు. ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? శక్తికి మించి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులంటే ఎలా? అప్పు తీసుకునేటప్పుడు తిరిగి కట్టగలిగే స్థోమత ప్రభుత్వానికి ఉందా? అని ఆలోచించాలి. అప్పు చేస్తాను, ఉచితాలిస్తాను.. తర్వాత వచ్చే గవర్నమెంట్ ఖర్మ అనే ధోరణి ఇవ్వాళ రాజకీయాల్లో కనిపిస్తున్నది’ అని వెంకయ్య చెప్పారు. ‘చేసిన అప్పులను ప్రజలకు ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో, నీటిపారుదల ప్రాజెక్టులకో, పవర్ ప్రాజెక్టులకో ఖర్చు పెట్టాలి.
అలా చేయడం వల్ల రిటర్న్స్ వస్తాయి. కానీ, జనాకర్షక పథకాలకు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలకు ఖర్చు చేస్తున్నారు’ అని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వైకల్యం ఉన్నవారికి, అనాథలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తే అర్థం చేసుకోవచ్చు కానీ అందరికీ ఉచితాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. మరేదానికి ఇవ్వకూడదన్నారు. పార్టీ ఫిరాయించే ముందు ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన సూచించారు.