హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగం, పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని దేశానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో ఐసీఏఆర్-ఐఏఆర్ఐ డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు కృషి ప్రశంసనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రొఫెసర్ ఎంఎస్. స్వామినాథన్ తొమ్మిదవ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు ఎంఎస్ స్వామినాథన్ ప్రతిభా పురస్కారాన్ని వెంకయ్య నాయుడు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలిచినందుకు ఈ పురస్కారం దక్కిందని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారత గ్రీన్ శిల్పి ప్రొఫెసర్ స్వామినాథన్ ప్రతిభా పురస్కారాన్ని శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉన్నదని తెలిపారు.