వేములవాడ, అక్టోబర్ 23: మద్యం మత్తులో ఉన్నాడో.. ఆర్థిక అవసరాలకో తెలియదు గానీ.. ఏకంగా కన్నబిడ్డనే విక్రయించాడో తండ్రి. దీంతో ఆ తల్లి బిడ్డ కోసం తల్లడిల్లింది. చివరికి పోలీసుల సాయంతో ఆ చిన్నారి క్షేమంగా తల్లి ఒడికి చేరింది. ఈ ఘటన బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో ఉండే బత్తుల రవీందర్-శ్యామల దంపతులకు ఐదుగురు సంతానం. దీంతో రవీందర్ తమ పది నెలల కూతురు మేఘనను ఎవరైనా కొంటే ఇస్తామని మధ్యవర్తులకు చెప్పా డు. విషయం తెలుసుకున్న జగిత్యాలకు చెం దిన లక్ష్మి మంగళవారం వేములవాడకు చేరుకొని రవీందర్‌కు రూ.90 వేలు ఇచ్చి బిడ్డను కొనుగోలు చేసింది. కూతురు కనిపించకపోవడంతో శ్యామల పోలీసులను ఆశ్రయించిం ది. జగిత్యాల జిల్లా వాసులు కొనుగోలు చేసినట్టుగా గుర్తించిన పోలీసులు చిన్నారిని తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. కూతురిని అమ్మిన తండ్రి రవీందర్‌తోపాటు కొనుగోలు చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశామని సీఐ వీరప్రసాద్ తెలిపారు. సంతానం లేని తాను పిల్లలను పెంచుకోవాలన్న ఆసక్తితో చిన్నారిని కొనుగోలు చేశానని, ప్రాంసరీ నోటును చూపుతూ లక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో బోరుమని విలపించింది.