హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్ల ద్వారా కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలి. రాష్ట్ర రైతాంగానికి సాగునీరిచ్చి ఆదుకోవాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కలుపుకొని కన్నెపల్లి పంప్‌హౌస్, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ మోటర్ల బటన్లను మేమే స్వయంగా నొకి రైతాంగానికి నీటిని విడుదల చేస్తాం’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చి తెలంగాణ రైతాంగం కడుపు కొట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. ఎగువన గోదావరిలో నీరు లేకున్నా ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం లక్ష క్యూసెకుల నీళ్లు మేడిగడ్డ నుంచి వృథాగా దిగువకు (ఆంధ్రాకు) వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఇలాంటి విపతర పరిస్థితుల్లో వృథాగా పోయే ఆ జలాలను ఒడిసిపట్టి తెలంగాణ పొలాలను తడుపాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నాడు నిర్మించారని గుర్తుచేశారు. మేడిగడ్డ బరాజ్ వద్ద కేవలం రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం పనికిరాకుండా పోయిందనే భ్రమలు కల్పిస్తూ 31 నెలలుగా రేవంత్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను పడావు పెట్టారని మండిపడ్డారు.
మేడిగడ్డ బరాజ్‌తో ఎలాంటి సంబంధం లేకుండానే అన్నికాలాలు ముఖ్యంగా కరువులో కూడా కన్నెపల్లి వద్ద నీరు నిల్వ ఉండేలా, ఆ నిల్వ నీటిని ఎత్తిపోసేలా అద్భుతమైన ఇంజినీరింగ్ వ్యవస్థను కేసీఆర్ అప్పుడే సిద్ధంచేసి ఉంచారని ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. మేడిగడ్డ బరాజ్‌కు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్‌చేస్తే చాలని, అకడ సిద్ధంగా ఉన్న పంప్‌హౌస్ బటన్ నొకితే కాళేశ్వరం నీరు నేరుగా అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి చేరుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర పరిపాలన చేతగాకే ఫ్రస్ట్రేషన్లో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎంను అన్న విషయాన్ని మరచి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతున్నారని తెలిపారు.
ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. నీళ్లు ఎత్తిపోయవచ్చా? లేదా? అన్న కోణంలో కనీసం ఒకసారైనా ఇంజనీర్లతో మాట్లాడారా? కరువు వచ్చినప్పుడు బరాజ్‌లను ప్రత్యామ్నాయంగా ఎలా ఉపయోగించుకోవచ్చో? ఓ బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఒకనాడైనా ఆలోచించారా? అని వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం గుడ్డి వ్యతిరేకత, రాజకీయ దురుద్దేశంతో నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఆగమాగం చేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. గతంలో రిటైర్డ్ ఇంజీనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికలోని కొన్ని అంశాలను తనకు అనుకూలంగా మార్చుకొని అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పుకొన్న ఇదే రేవంత్‌రెడ్డి.. తాజాగా కాళేశ్వరం నీళ్లివ్వాలని అదే రిటైర్డ్ ఇంజినీర్లు లేఖ రాసేసరికి వారిపై హింసాత్మక భాష వాడుతున్నారని మండిపడ్డారు. మతిభ్రమించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దింపాలని కోరుతూ తాము రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.