వేల్పూర్, ఆగస్టు 16: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్, కేసీ తండాకు చెందిన సీనియర్ నాయకులు లకావత్ కన్నయ్య, చిలివేరి సత్యనారాయణ, తండా పెద్దమనిషి దేవులునాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయకత్వంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు వంద మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో యాప్‌ల పేరుతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. యూరియా, ఎరువుల కోసం అన్నదాతలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.