వేల్పూర్, అక్టోబర్ 8: కాంగ్రెస్‌ది నయవంచన పాలన అని, గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ హామీలను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని కేసీఆర్ కాలనీలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వేముల మాట్లాడారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిందని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిందని విమర్శించారు. వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. 22 నెలలైనా ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. గ్యారెంటీ కార్డులు ఇచ్చి ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగాలు అడిగిన పాపానికి నిరుద్యోగులను చితకొట్టింది ఈ ప్రభుత్వమేనని మండిపడ్డారు.