వేల్పూర్, సెప్టెంబర్ 7 : నవాబు లిఫ్ట్, కుకునూర్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, గుత్ప లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించి ఆయా గ్రామాల్లోని చెరువులను నింపాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. లిఫ్ట్‌లు ప్రారంభం కాక చెరువులకు నీరు రావడం లేదని నవాబు లిఫ్ట్ కమిటీ, కుకునూర్ వీడీసీ సభ్యులు, ఆయకట్టు రైతులు వేల్పూర్‌లో ఎమ్మెల్యే వేములను ఆదివారం కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎస్సారెస్పీలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ లిఫ్ట్‌లను ఎందుకు ప్రారంభించడంలేదని ప్రశ్నించారు. లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించాలని సాంకేతికపరమైన సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. లిఫ్ట్‌ల పరిస్థితులపై ఇరిగేషన్ శాఖ సీఈ మధుసూదన్, ఈఈ భానుప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు.
సీజన్ ప్రారంభించక ముందే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయా లేనిది చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో 45 టీఎంసీల నీరు ఉన్నప్పుడే చెరువులు నింపి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని, ఇప్పుడు వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయని తెలిపారు. లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించి చివరి ఆయకట్టు వరకు నీరందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వేముల సూచించారు.