హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సొంత భూముల ధరలు పెంచుకునేందుకే ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం అలైన్మెంట్లో రేవంత్ ప్రభుత్వం మార్పులు చేసిందని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే ట్రిపుల్ ఆర్కు అనుమతులు వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ కృషి వల్లే భూ సర్వే పూర్తయి, అలైన్మెంట్ ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్టు తెలిపారు. అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించడంతో టోకెన్ కింద ఈ ప్రాజెక్టు ఖాతాలో రూ.100 కోట్లు జమచేసిన విషయాన్ని ఆయన ఆధారాలతో సహా వివరించారు.
ప్రాజెక్టు ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ రైతులకు పరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. 7,150 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నట్టు టెండర్లు పిలిచి మూడుసార్లు ఎందుకు రద్దుచేశారని ప్రశ్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని, రెండేండ్లలో పూర్తిచేస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరుడు డిసెంబర్లో గొప్పగా ప్రకటించారని, కానీ పనుల్లో కదలిక లేదని విమర్శించారు. సర్వే చేయకుండా, రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకుండా టెండర్లు పిలవడం ఏంటని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కలిపి రాష్ట్రంలో 16 మంది ఎంపీలు ఉండి ఏ లాభమని వేముల ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, అందరూ కలిసికట్టుగా వెళ్లి ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అయితే, కొత్త అలైన్మెంట్ కాకుండా పాతదాని ప్రకారమే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణ భాగం భూ నిర్వాసితులతో ‘ప్రాజెక్టు అయ్యేదా? పోయేదా?’ అన్న మంత్రి వ్యాఖ్యల వీడియో, ఆడియోను వేముల ప్రదర్శించారు.
ఉప్పల్-నారపల్లి ఫై ఓవర్ పనులపై సంబంధిత మంత్రి రోజుకో మాట మాట్లాడుతున్నారని వేముల దుయ్యబట్టారు. వాస్తవానికి కేసీఆర్ హయాంలో ఆయన తీసుకున్న చొరవ వల్ల 40 శాతానికి పైగా పనులు పూర్తయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో కనీసం రెండు అడుగుల పనులు కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టిమ్స్ దవాఖానల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎల్బీనగర్, మియాపూర్, సనత్‌నగర్ టిమ్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి, సంజీవోల్ల రాఘవయాదవ్ పాల్గొన్నారు.