హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ) : ‘అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టయలైంది. రెండు పార్టీల అక్రమ బంధం నగ్నంగా బయటపడింది. సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రసంగాలే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్లో ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇస్తే, 8 మంది ఉన్న బీజేపీ నుంచి ఇద్దరిని మాట్లాడించడాన్ని బట్టి చూస్తేనే రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయం ప్రజలకు అర్థమైందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై సీబీఐ విచారణ పేరిట కుట్రలకు దిగుతున్నదని నిప్పులు చెరిగారు. ‘సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదని.. కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ టీం’అని ఎద్దేవా చేశారు. మొన్న సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో సీబీఐని బీజేపీ జేబు సంస్థ అని ఆరోపించిన సీఎం రేవంత్‌రెడ్డి 24 గంటలు గడవకముందే మనసెలా మారిందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ డైరెక్షన్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించారని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, టీజీఐఐసీ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రశాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఘోష్ కమిషన్ ముసుగులో కేసీఆర్‌పై కక్ష సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ కంకణం కట్టుకున్నాయని విమర్శించారు.
కేసీఆర్‌పై బురద జల్లేందుకే కాళేశ్వరం కమిషన్ పేరిట కాంగ్రెస్ సభ సాక్షిగా బురదజల్లిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ బురదను కడిగేందుకు, ప్రాజెక్టు గొప్పదనాన్ని తెలియజెప్పి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు నిండు శాసనసభలో సత్యాలు మాట్లాడుతుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఆయనకు కేటాయించిన 80 నిమిషాల ప్రసంగంలో 33 సార్లు అడ్డు తగిలారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ సైతం అధికార పక్షానికి వంతపాడుతూ హరీశ్‌ను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. రెండు పార్టీల కుట్రలను ఛేదించి కాళేశ్వరం ఔన్నత్యాన్ని, కేసీఆర్ గొప్పతనాన్ని హరీశ్‌రావు చాటిచెప్పారని ప్రశంసించారు.
హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డుపడిన పాల్వాయి తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను వదిలి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి స్క్రిప్ట్‌ను చదివి రెండు పార్టీలు ఒక్కటేనని చాటిచెప్పారని చురకలంటించారు. ఆ పార్టీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌కు వంతపాడిన విషయం తెలంగాణ సమాజం మొత్తం చూసిందని పేర్కొన్నారు. 2018లో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడైనప్పటి నుంచి కాంగ్రెస్‌తో కలిసి కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
నాడు మేడిగడ్డ పిల్లర్లలో సమస్యలు వస్తే నాలుగు రోజుల్లోనే వచ్చిన కేంద్ర సంస్థ ఎన్డీఎస్ఏ వారం రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చిందని ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో అనేక ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ‘సుంకిశాల గోడ కూలిపోయినా, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయినా, ఎస్సెల్బీసీ కుప్పకూలి 8 మంది మరణించినా, పెద్దవాగు కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? కేంద్రం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం డయాఫ్రమ్ వాల్ మూడుసార్లు కొట్టుకుపోయినా ఎం దుకు స్పందిచలేదు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘కేసీఆర్ కట్టిన కాళేశ్వరానికి ఓ నీతి, కాంగ్రెస్‌కు మరో నీతా? వేల కోట్ల నష్టం జరిగినా పట్టించుకోకపోవడంలోని ఆంతర్యమేంటి? కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కుకాకుంటే ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు?’ అని నిలదీశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాటకాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఓవైపు రాహుల్‌గాంధీ సీబీఐ మోదీ జేబు సంస్థ అని నిత్యం మొత్తుకుంటున్నారని, రేవంత్‌రెడ్డి మాత్రం బండి సంజయ్ డైరెక్షన్లో కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించారని ధ్వజమెత్తారు.
మేడిగడ్డను ఎండబెట్టి, కాళేశ్వరాన్ని పండబెట్టి గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు చంద్రబాబు, మోదీ కలిసి సాగిస్తున్న నాటకంలో సీఎం రేవంత్‌రెడ్డి పావుగా మారారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వారి చేతిలో కీలుబొమ్మలా మారి మేడిగడ్డకు మరమ్మతు చేయకుండా చోద్యం చూస్తున్నారన్నారని విమర్శించారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు మళ్లించి కావేరి లింక్ ద్వారా తమిళనాడుకు తరలించుకెళ్లేందుకు మోదీ వేస్తున్న ఎత్తులకు రేవంత్‌రెడ్డి వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో భాగంగానే సీబీఐ విచారణ పేరిట కాళేశ్వరానికి శాశ్వతంగా సమాధి కట్టేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకుంటే కూలిన సుంకిశాల, మునిగిన వట్టెంపంపు, కొట్టుకుపోయిన పెద్దవాగు, కుప్పకూలిన ఎస్ఎల్బీసీపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తే బీఆర్ఎస్ ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోదని స్పష్టం చేశారు.
ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కు ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు కొత్తకాదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు కుట్రలు చేస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసులు, జైళ్లకు బీఆర్ఎస్ బెదరబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా వెంటపడతామని తేల్చిచెప్పారు. ప్రజాక్షేత్రంలో అడుగడుగునా ఎండగడతామని హెచ్చరించారు. చట్టపరంగానే కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్, బీజేపీ కలిసి మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తెరపైకి తెస్తున్నాయని ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు ప్రచారం చేసి లబ్ధి పొందారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఘోష్ కమిషన్ వేసి రాద్ధాంతం చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు కమిషన్ నివేదిక, సీబీఐ విచారణ పేరిట హడావుడి చేస్తున్నారు. ఓట్ల కోసం ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు’ అని తూర్పారబట్టారు. రూ. 94 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరంలోని వంద విభాగాల్లోని ఒక కాంపోనెంట్ మేడిగడ్డ అని, ఇందులోని ఏడు బ్లాకుల్లోని ఒక బ్లాకులోగల మూడు పిల్లర్లలో సమస్య వచ్చిందని తెలిపారు. కానీ మొత్తం ప్రాజెక్టే పనికిరాదని దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రూ. 4 వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డలోని మూడు పిల్లర్లలో వచ్చిన పగుళ్ల కారణంగా జరిగిన నష్టం కేవలం రూ. 350 కోట్లు మాత్రమేనన్నారు. రిపేర్ చేసి ప్రజలకు నీరందించాల్సిన ప్రభుత్వం కేసీఆర్‌పై కక్షతోనే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రశాంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో సీబీఐని అనుమతించకుండా నిరాకరిస్తే రేవంత్ మాత్రం కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడమే ఇందుకు తిరుగులేని సాక్ష్యమని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని మోసం చేసి త్వరలోనే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని జోస్యం చెప్పారు. ఇందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సైతం రేవంత్‌కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.