హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల సమయంలో వినియోగించే వాహనాలకు ట్రాకింగ్(జీపీఎస్) విధానం అమలు చేయాలని సివిల్ సప్లయ్‌ని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఈ సీజన్లో అమల్లోకి తీసుకురావాలని సూచించింది. మంగళవారం వానకాలం ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐ వర్క్‌షాప్ నిర్వహించింది. సమావేశానికి మంత్రి ఉత్తమ్, సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు, సివిల్‌సప్లయ్ జిల్లా మేనేజర్లు హాజరయ్యారు. ఈ సీజన్లో కొత్త విధానాలు అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీఎంఆర్ గడువు పెంపు కోసం ధాన్యం నిల్వలపై ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్టు తెలిసింది. దీని ద్వారా ధాన్యం నిల్వలు తనిఖీ చేయాలని ఆదేశించింది.