హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు దివ్యాంగులకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్-ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఫర్ దలిత్ ఎంటర్ప్రెన్యూర్) పథకం కింద ట్యాక్సీలు, ఇతర వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇస్తున్న రాయితీని ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్టు పరిశ్రమల శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకొని ట్రాన్స్పోర్టు వ్యాపారంలో రాణించాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లినైట్టెంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-ప్రైడ్ పథకాన్ని అమలుచేసింది. బలహీనవర్గాలకు చెందిన యువత, నిరుద్యోగులు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విరివిగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందించింది.
ఇందులో భాగంగా ట్యాక్సీలు, లారీలు, బస్సులు తదితర వాహనాలు కొనుగోలుచేసి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో రాయితీలు అందించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వేలాది మంది లాభపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు, ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేసేవారు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారారు. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువకులు ఇతరుల వద్ద చేస్తున్న ఉద్యోగాలు మానుకొని సొంత కార్లు కొనుగోలు చేసుకొని ఓలా, ఉబర్ వంటి సంస్థలకు పనిచేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఎస్సీ, ఎస్టీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది.